Revanth Reddy: రేవంత్ రెడ్డి శాంతి ర్యాలీ.... పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ

Revanth Reddy  Owaisi Condemn Pahalgam Attack
షార్ట్స్‌లో చూడండి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు.

ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇచ్చిన పిలుపులో భాగంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. 

కాగా, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Asaduddin Owaisi
Peace Rally
Hyderabad
Terrorism
Jammu and Kashmir
Pahalgam Attack
Congress Party
India
Political Rally

More Telugu News