ఖరీఫ్‌కు ఉత్తరాంధ్రకు నీరు అందించడమే లక్ష్యం: పోలవరం పనులపై మంత్రి నిమ్మల

  • ఉత్తరాంధ్రకు ఖరీఫ్‌ నాటికి గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని నిమ్మల వెల్లడి
  • పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 8 ప్యాకేజీలుగా వేగవంతం
  • రూ.1200 కోట్లతో పనులు... జూన్ కల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు
పోలవరం ప్రాజెక్టు పనులు, ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ఖరీఫ్‌ నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వద్ద నిర్మిస్తున్న పంపా ఆక్విడెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎడమ కాలువ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. 

"ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు పోలవరం ఎడమ కాలువను సందర్శించి, జూన్ 25 కల్లా మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునేందుకు తక్షణమే రూ.1200 కోట్లు మంజూరు చేసి, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాం" అని మంత్రి వివరించారు.

ఎడమ కాలువ పనులను మొత్తం 8 ప్యాకేజీలుగా విభజించి ఏకకాలంలో పనులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొన్నిచోట్ల పనులు క్లిష్టంగా ఉన్నాయని, ముఖ్యంగా పంపా ఆక్విడెక్ట్ వద్ద ఇటీవల వరకు నీరు నిలిచి ఉండటం, ఇప్పుడు నీటిని తోడి లోతుగా ఫౌండేషన్ పనులు (సుమారు 100 అడుగుల లోతు) చేయాల్సి రావడం సవాలుగా ఉందని అన్నారు. 

పోలవరం ప్రధాన డ్యామ్ పనుల పురోగతి గురించి మాట్లాడుతూ, డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఏప్రిల్ 20 నాటికి 200 మీటర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే రెండు కట్టర్లు పనిచేస్తుండగా, ఈ నెలాఖరుకు మూడో కట్టర్ రానుందని చెప్పారు. డిసెంబర్ 2025 నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 

మొత్తం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే సాంకేతిక అంశాలు అనుకూలిస్తే 2027 జూన్ నాటికి, అంటే గోదావరి పుష్కరాల సమయానికి పూర్తి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. 


More Telugu News