ఏపీ గురుకుల కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్‌కు ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి అవార్డు
- సివిల్ సర్వీస్ డే సందర్భంగా అవార్డు ప్రదానం
- ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు
- దేశంలో పది మంది ఐఏఎస్‌లకు ప్రధానమంత్రి అవార్డులు
ఈ సందర్భంగా పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ అధికారులకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించింది. ప్రసన్న వెంకటేశ్ జనవరి 2022 నుంచి జులై 2024 వరకు ఏలూరు జిల్లాకు తొలి కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేశారు.
సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణులు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆయన పాటుపడ్డారు. ఈ విధంగా, జిల్లాలో సుపరిపాలన అందించడం ద్వారా ఈ అవార్డుకు ఎంపికైన దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లలో ప్రసన్న వెంకటేశ్ ఒకరు. ఈ సందర్భంగా అవార్డు అందజేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రసన్న వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రజా సేవకునిగా శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.