ఇక.. మొబైల్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తు

  • వెసులుబాటు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • రవాణాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్తే సరి
  • అందులో దరఖాస్తు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి
  • ఆ తర్వాత ప్రింట్ తీసుకుని కార్యాలయానికి వెళ్తే లైసెన్స్ రెన్యువల్
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయం చుట్టూ, దళారుల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే. ఇకపై రెన్యువల్ కోసం కార్యాలయానికి వెళ్లకుండా మొబైల్ ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం తొలుత రవాణాశాఖ వెబ్‌సెట్‌లోకి వెళ్లి, అందులోని ‘లైసెన్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘డ్రైవింగ్ లైసెన్స్‌‘ను ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. అందులో కింద ఉన్న ‘రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్’ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి. 

ఆ పేజీలో కింద వచ్చిన బాక్స్‌లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఎక్కడ ఇచ్చారు? పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను నింపిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేస్తే వచ్చే నంబర్‌తోపాటు క్యాప్చాను ఎంటర్ చేసి ‘గెట్ డీటెయిల్స్‌’ నొక్కగానే మనం ఇచ్చిన వివరాలు అక్కడ కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకున్న తర్వాత ‘కన్ఫాం’పై క్లిక్ చేయాలి. 

తర్వాత మరో విండోలో కనిపించే తేదీల్లో మనకు వీలున్న తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని ఒరిజినల్ లైసెన్స్, గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మన పత్రాలు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరిస్తారు.


More Telugu News