ఏపీ, తెలంగాణ‌లో ఘ‌నంగా చంద్ర‌బాబు పుట్టిన‌రోజు వేడుక‌లు

  • నేడు ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ పుట్టిన‌రోజు
  • మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చంద్ర‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌లు
  • 75 కిలోల కేక్ క‌ట్ చేసిన టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు
  • హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్‌లో సంబ‌రాలు
నేడు ఏపీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు 75వ పుట్టిన‌రోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఎన్ జ‌న్మ‌దిన వేడుక‌లను టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఆల‌యాల్లో నేత‌లు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే పార్టీ ఆఫీసుల్లో కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకుంటున్నారు.  

మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఏకంగా 75 కిలోల కేక్ ను క‌ట్ చేయ‌డం విశేషం. ఈ వేడుక‌ల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు, మంత్రి అచ్చెన్నాయుడు, వ‌ర్ల రామ‌య్య‌, అశోక్ బాబు, టీడీ జ‌నార్ధ‌న్‌, ఏవీ ర‌మ‌ణ‌, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, వీవీవీ చౌద‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విజిన‌రీ లీడ‌ర్‌ చంద్ర‌న్న పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను నేత‌లు వీక్షించారు. 

హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యుడు న‌ర్సిరెడ్డి, పార్టీ నేత అర‌వింద్ కుమార్ గౌడ్‌, నంద‌మూరి సుహాసిని హాజ‌ర‌య్యారు. 

అటు తిరుమ‌ల అలిపిరి మార్గంలో కూడా టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీగా కొబ్బ‌రికాయ‌లు కొట్టి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

ఇక చంద్ర‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు చంద్ర‌బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.   



More Telugu News