60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ బెంగాల్ మాజీ చీఫ్

  • పార్టీ సహోద్యోగి రింకూ మజుందార్ ను పెళ్లాడిన ఘోష్
  • తన నివాసంలో కొద్దిమంది బంధువుల మధ్య వేడుక
  • తల్లి కోరిక మేరకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపిన దిలీప్ ఘోష్
బీజేపీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. పార్టీ నేత రింకూ మజుందార్ (51)ను ఆయన శుక్రవారం వివాహం చేసుకున్నారు. కోల్‌కతా సమీపంలోని ఆయన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైదిక సంప్రదాయాల ప్రకారం ఈ వేడుక జరిగింది.

వివాహానంతరం దంపతులిద్దరూ సంప్రదాయ బెంగాలీ దుస్తుల్లో మీడియాతో మాట్లాడారు. తన తల్లి కోరికను నెరవేర్చడానికే ఈ వయసులో పెళ్లి చేసుకున్నట్లు దిలీప్ ఘోష్ తెలిపారు. తన వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టంచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఇతరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

దిలీప్ ఘోష్, రింకూ మజుందార్ 2021లో ఉదయం వాకింగ్ సందర్భంగా ఎకో పార్క్‌లో తొలిసారి కలుసుకున్నారు. ఈ నెలలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తను పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఘోష్ వెంటనే అంగీకరించారని రింకూ మజుందార్ తెలిపారు. దిలీప్ ఘోష్‌కు ఇది మొదటి వివాహం కాగా, రింకూ మజుందార్‌కు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు ఉన్నారు.

ఈ వివాహ వేడుకకు పలువురు బీజేపీ నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు బొకేలు పంపించి ఓ లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీఎంసీ నేతలు కూడా అభినందనలు తెలియజేశారు.

అయితే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పందిస్తూ.. మమతా బెనర్జీ సృష్టించిన ఎకో పార్క్‌లోనే వారి పరిచయం ప్రేమగా మారిందని, వారిద్దరినీ కలపడంలో సీఎం పాత్ర ఉందంటూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఘోష్.. 2015 నుంచి 2021 వరకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.



More Telugu News