ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ రికార్డు... సచిన్‌ను అధిగ‌మించి ర‌జ‌త్‌ అరుదైన ఘ‌న‌త‌..!

  • త‌క్కువ ఇన్నింగ్స్‌లో 1000 ర‌న్స్‌ చేసిన రెండో ప్లేయ‌ర్‌గా ర‌జ‌త్ పాటీదార్‌
  • కేవ‌లం 30 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్న వైనం
  • 31 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించిన స‌చిన్‌
  • ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో సాయి సుదర్శన్ (25 ఇన్నింగ్స్‌)  
శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ పాటీదార్ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను వెన‌క్కి నెట్టి మ‌రి ఈ రికార్డును సాధించ‌డం విశేషం. 

ర‌జ‌త్ త‌క్కువ ఇన్నింగ్స్‌లో 1000 ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కేవ‌లం 30 ఇన్నింగ్స్‌లలో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో సచిన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లను అధిగమించాడు. వీరిద్దరూ 31 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించారు.

కాగా, ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జ‌ట్టు ఆట‌గాడు సాయి సుదర్శన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు కేవ‌లం 25 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. ఇక, స‌చిన్‌, రుతురాజ్ త‌ర్వాత ముంబై ఇండియన్స్‌కు చెందిన తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను న‌మోదు చేసి నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

కాగా, ఈ ఏడాది ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌జ‌త్ పాటీదార్ ఏడు మ్యాచుల్లో 209 ప‌రుగులు చేసి జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచులు ఆడి, 4 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది.


More Telugu News