కంటి పైభాగంలో స్క్రూడ్రైవర్.. ఆపరేషన్ చేసి తొలగించిన గాంధీ వైద్యులు

––
విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ యువకుడి కంటి పైభాగంలో స్క్రూడ్రైవర్ దిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గాంధీ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి స్క్రూడ్రైవర్ ను తొలగించారు. ఈ ఘటనలో యువకుడి కంటికి ఎలాంటి గాయం కాలేదని, చూపు విషయంలోనూ ఎటువంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజకుమారి వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారానికి చెందిన రంజిత్‌(21) ప్రైవేటుగా విద్యుత్తు పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

ఈ నెల 8న గ్రామంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్క్రూడ్రైవర్‌ కుడి కంటి పైభాగంలో దిగబడింది. దీంతో కుటుంబ సభ్యులు రంజిత్ ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నిమ్స్‌కు ఆపై ఈ నెల 10న గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో స్క్రూడ్రైవర్ కంటి పైభాగంలో గుచ్చుకుందని, అందువల్ల కంటి లోపల గాయం కాలేదని తేలింది. దీంతో న్యూరోసర్జరీ వైద్యులు రెండు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి స్క్రూడ్రైవర్ ను బయటకు తీశారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం రంజిత్ కోలుకుంటున్నాడని డాక్టర్ రాజకుమారి తెలిపారు.


More Telugu News