కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు
- అనుమతుల్లేకుండా చెట్లు కొట్టివేసినట్లైతే సీఎస్ సహా అధికారులంతా జైలుకేనని వార్నింగ్
- తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందన్న అమికస్ క్యూరీ
- ఆ చట్ట ప్రకారమే చెట్ల నరికివేత చేపట్టినట్లు కోర్టుకు వివరణ
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించారు. చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్నాకే జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు సింఘ్వీ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేదే తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయి తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ కేసు విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.