అజిత్ కొత్త సినిమా టీమ్ కు ఇళయరాజా నోటీసులు... రూ.5 కోట్లు కట్టండి!

  • 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్ర నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీస్
  • తన పాటలను అనుమతి లేకుండా వాడారని ఆరోపణ
  • మూడు గీతాల రీక్రియేషన్‌పై అభ్యంతరం
  • రూ. 5 కోట్ల నష్టపరిహారం డిమాండ్
  • పాటల తొలగింపు, క్షమాపణ కోరిన సంగీత దిగ్గజం
కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా ఇటీవల విడుదలైన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రం ఊహించని వివాదంలో చిక్కుకుంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమా నిర్మాతలకు తాజాగా లీగల్ నోటీసులు జారీ చేయడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన అనుమతి లేకుండా చిత్రంలో పాటలను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో తాను స్వరపరిచిన మూడు ప్రఖ్యాత గీతాలను 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రంలో తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి గానీ, హక్కులు గానీ పొందకుండా రీక్రియేట్ చేసి వాడుకున్నారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ ఉల్లంఘనకు గాను చిత్ర నిర్మాతలు తక్షణమే రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. 

అంతేకాకుండా, సినిమా నుంచి ఆ మూడు పాటలను వెంటనే తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఇళయరాజా కోరారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, అజిత్ కథానాయకుడిగా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రం తెరకెక్కింది. యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫర్వాలేదనే టాక్ తో ప్రదర్శితమవుతోంది. కాగా, ఇళయరాజా పంపిన లీగల్ నోటీసులపై 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించలేదు. 


More Telugu News