ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

  • ఫ‌లితాలు విడుద‌ల చేసిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా మంత్రి లోకేశ్ ప్ర‌క‌టన‌
  • ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 70 శాతం ఉత్తీర్ణ‌త‌
  • సెకండ్ ఇయ‌ర్‌లో 83 శాతం ఉత్తీర్ణత
ఏపీ ఇంటర్మీడియ‌ట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.inలో చూసుకోవ‌వచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్‌ 9552300009కు  "హాయ్" సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ఇక ఈ ఏడాది ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 70 శాతం, సెకండ్ ఇయ‌ర్‌లో 83 శాతం ఉత్తీర్ణత న‌మోదైన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలలో ఉత్తీర్ణ‌త పెరిగింద‌ని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల(GJCs)లో ద్వితీయ‌ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత పదేళ్లలో అత్యధికమని హర్షం వ్య‌క్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనం అని పేర్కొన్నారు. 

ఈసారి పాస్ కానివారు నిరుత్సాహపడకుండా, దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకొని మ‌రింత‌ కష్టపడి చ‌ద‌వాల‌ని అన్నారు. విద్యార్థులు ఎప్పుడూ పోరాడ‌టాన్ని ఆప‌కూడ‌ద‌ని, విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేద‌ని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఏడాది ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షల‌కు హాజ‌రైన‌ విష‌యం తెలిసిందే.

స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే..!
ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామ‌ని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్ సప్లిమెంటరీ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15-22వ తేదీల మ‌ధ్య‌ పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాల‌నుకునే విద్యార్థులు ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవాల‌ని తెలిపారు.   


More Telugu News