సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్
- తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివని కాంగ్రెస్ ప్రభుత్వాలపై సెటైర్
- తెలంగాణ రజాకార్లను తరిమికొట్టినట్లు కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమేస్తామని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలే బ్రిటీష్ వారసత్వం అందిపుచ్చుకున్నారని మండిపాటు
నిజాం పాలనలో రజాకార్లను తరిమికొట్టినట్లు దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ మరోమారు అధికారంలోకి రావడం అసాధ్యమని, ఆ పార్టీ నుంచి రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అని అన్నారు. రేవంత్ రెడ్డిలో అసహనం, అభద్రత కనిపిస్తోందని, ఆ ఆందోళనతోనే రాహుల్ గాంధీ మెప్పుకోసం బీజేపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలది బ్రిటీష్ వారసత్వం అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. నిజానికి బ్రిటీష్ పాలకుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నది కాంగ్రెస్ నేతలేనని విమర్శించారు.