వరుసగా నాలుగోసారి ఓడిన చెన్నై

  • 18 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్
  • సెంచరీతో చెలరేగిన యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య 
  • భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన చెన్నై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై రాత మారడం లేదు. పంజాబ్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా, పంజాబ్‌కు ఇది మూడో విజయం. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరును ఛేదించడంలో ఒత్తిడికి గురై ఓటమి చవిచూసింది. ఫలితంగా పంజాబ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పంజాబ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవోన్ కాన్వే (69) బలమైన పునాది వేసినప్పటికీ ఆ తర్వాతి బ్యాటర్లు దానిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఒక్క పరుగు చేసి నిరాశ పరిచాడు.  శివం దూబే (49), ధోనీ (27) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వీరు కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టడంతో జట్టు ఓటమి ఖాయమంది. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 28 పరుగులు అవసరం కాగా, 9 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఒకానొక దశలో చెన్నై బౌలర్ల దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు విలవిల్లాడారు. 8 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోవడంతో ఇక ఆ జట్టు పని అయిపోయిందని అనుకున్నారు. సరిగ్గా అప్పుడే యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ చెన్నై బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 39 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 42 బంతులు ఆడిన ప్రియాంశ్ 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో శశాంక్‌సింగ్ (52), మార్కో జాన్సెన్ (34) బ్యాట్ ఝళిపించారు.  చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో కదం తొక్కిన ప్రియాంశ్ ఆర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.


More Telugu News