సల్మాన్ అభిమానులపై సికందర్ నిర్మాత భార్య ఆగ్రహం

  • సికందర్ సినిమా ఆకట్టుకోకపోవడంతో సల్మాన్ ఫ్యాన్స్ నిరాశ
  • నిర్మాత సాజిద్ నదియావాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు
  • అభిమానుల తీరుపై మండిపడ్డ వార్దాఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ‘సికందర్’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ చిత్రంలో సల్మాన్‌కు జంటగా రష్మిక నటించగా కాజల్‌, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. రంజాన్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ‘సికందర్‌’ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత సాజిద్‌ నదియావాలా పలు ఇంటర్వ్యూలలో పేర్కొనడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సికందర్ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

తమ అభిమాన హీరో నుంచి మరో బ్లాక్ బస్టర్ వస్తుందని ఆశించిన అభిమానులు.. సికందర్ సినిమా ఫలితంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం నిర్మాత సాజిద్ నదియావాలానేనని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హీరో కెరీర్‌ను నాశనం చేస్తున్నారంటూ సాజిద్ ను నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానుల తీరుపై సాజిద్‌ నదియావాలా సతీమణి వార్దాఖాన్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానుల పోస్టులను రీపోస్ట్‌ చేస్తూ తిడుతూ కామెంట్స్‌ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ ‘విమర్శలను ఈ విధంగా రీపోస్ట్‌ చేస్తున్నందుకు మీకు ఏమాత్రం సిగ్గుగా లేదా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని జవాబిచ్చారు. అనంతరం ఆమె ఆయా వ్యాఖ్యలను తొలగించారు.


More Telugu News