తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన అశ్వనీకుమార్

  • ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన ముంబై ఇండియన్స్
  • కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపు
  • నాలుగు వికెట్లు పడగొట్టిన అరంగేట్ర బౌలర్ అశ్వనీకుమార్
  • తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్వనీకుమార్ తొలి మ్యాచ్‌‌తోనే రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

ఐపీఎల్ కెరియర్‌లో తొలి బంతికే రహానే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రింకూసింగ్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీశ్ పాండేను పెవిలియన్ పంపాడు. అలాగే, హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇలా తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్వినీకుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

23 ఏళ్ల అశ్వనీకుమార్ మొహాలీలో జన్మించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. గతేడాది జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నీలో మెరిసి ముంబై మేనేజ్‌మెంట్ దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో అశ్వినీకుమార్‌ను ముంబై ఫ్రాంచైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున అరంగేట్రం చేసిన అశ్వనీకుమార్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీసుకున్నాడు.


More Telugu News