ధోనీ మెచ్చుకున్న కుర్రాడ్ని పక్కనబెట్టిన ముంబయి ఇండియన్స్

  • చెన్నైతో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన విఘ్నేశ్ పుతూర్.
  • నేడు గుజరాత్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కని వైనం
  • ముంబయి ఇండియన్స్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయంపై విమర్శలు
ముంబై ఇండియన్స్ జట్టులో చైనామెన్ బౌలర్ విఘ్నేశ్ పుతూర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 23 ఏళ్ల ఈ యువ బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, దీపక్ హుడాలను అవుట్ చేసి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ధోనీ అంతటి దిగ్గజం కూడా విఘ్నేశ్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడి భుజం తట్టి  మరీ అభినందించాడు.

అయితే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఈ కుర్రాడికి తుది జట్టులో స్థానం లభించలేదు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ పుతూర్‌ను ఆడించకపోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

విఘ్నేశ్ పుతూర్ గొప్ప బౌలర్ కాకపోవచ్చు కానీ అతను తన మొదటి మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి ఈరోజు ఆడించి ఉండాల్సింది అని అభిప్రాయపడుతున్నారు.

కాగా, సీఎస్‌కేపై మూడు వికెట్లు తీసిన విఘ్నేష్ పుతూర్‌కు ప్రశంసలు దక్కాయి. కానీ కెప్టెన్ హార్దిక్ జట్టులోకి రావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలపాలైంది.
 
చిన్నతనంలో మీడియం పేస్ బౌలర్‌గా రాణించిన విఘ్నేశ్ పుతూర్‌ను చైనామెన్ బౌలర్‌గా మార్చడంలో అతని స్నేహితుడు మహమ్మద్ షరీఫ్ కీలక పాత్ర పోషించాడు. కేరళలోని మలప్పురం జిల్లాలో 11 ఏళ్ల వయస్సులో విఘ్నేశ్ ఆడుతుండగా షరీఫ్ అతడిలోని ప్రతిభను గుర్తించాడు. లెగ్ స్పిన్ వేయడం ద్వారా రాణించగలవని షరీఫ్ అతనికి సలహా ఇచ్చాడు. "నేను ఒక ఆఫ్ స్పిన్నర్‌ను కావడంతో స్పిన్ బౌలింగ్ సాంకేతిక అంశాలను అతనికి నేర్పించాను. విఘ్నేశ్ త్వరగా నేర్చుకున్నాడు. అతడిని క్రికెట్ శిక్షణ శిబిరానికి వెళ్లమని సూచించాను" అని షరీఫ్ ఒక టీవీ ఛానెల్‌కు తెలిపాడు.



More Telugu News