Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృత్రిమ క్లోమగ్రంధితో షుగర్‌ స్థాయిలు సమం

శరీరంలో షుగరు స్థాయిలు సమంగా లేకుంటే సమస్యలు వస్తాయి. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి పెరిగినా, తగ్గినా సమస్యే. అయితే ఇలాంటి సమస్యలకు కృత్రిమ క్లోమగ్రంధితో చెక్‌ పెట్టవచ్చని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వారు కృత్రిమ క్లోమగ్రంధి పనితీరును ఈ సందర్భంగా పరిశీలించారు. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలను ఇది గమనిస్తుందని వారు తెలిపారు.

ఈ కృత్రిమ క్లోమగ్రంధి మన శరీరానికి అమర్చిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రారెడ్‌ డాటా లింక్‌ మన శరీరంలోని ఇన్సులిన్‌ వివరాలను గమనిస్తుంటుంది. రోగి శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి ఎంత ఉంది? అనే విషయాన్ని రోగి శరీరానికే అమర్చి వున్న ఇన్సులిన్‌ పంపుకు అందజేస్తుంది. ఇన్సులిన్‌ స్థాయిలు ఏమాత్రం తగ్గినా, పెరిగినా వెంటనే ఈ స్థాయి తగుమాత్రం ఉండేలా ఈ కృత్రిమ క్లోమగ్రంధి వల్ల సర్దుబాటు జరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది టైప్‌1 మధుమేహ రోగులకు బాగా ఉపయోగపడుతుందని, రాత్రి సమయంలో ఇన్సులిన్‌ స్థాయిలు పడిపోకుండా ఉండేందుకు ఎంతో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News