చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం: ఏపీ మంత్రి సవిత

  • చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత
  • త్వరలో రాష్ట్రంలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు 
  • ఎగ్జిబిషన్ విక్రయాలతో అమ్మకాలు పెరిగాయని వెల్లడి
నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను మంగళవారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాబోయే ఉగాది సంబరాల నేపథ్యంలో విజయవాడలో చేనేత ఎగ్జిబిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్రానికి చెందిన పొందూరు, ఉప్పాడ, అంగర, పులగర్త, బందరు, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, చీరాల చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, వెంకటగిరి, ధర్మవరం, మదనపల్లి, ఎమ్మిగనూరు, గద్వాల్, కాంచీపురం, పోచంపల్లి శారీ స్టాళ్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతన్నలు 89 స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు.

ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న నేతన్నలందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సర పండగ దృష్ట్యా ప్రజలందరూ సంప్రదాయానికి ప్రాధాన్యమిస్తూ చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. 


More Telugu News