గుడి కూల్చేస్తారనే ఆందోళనతో ఆలయంలోనే పూజారి ఆత్మహత్య.. అహ్మదాబాద్ లో ఘటన
- ఆలయాన్ని కాపాడాలంటూ కొడుకుకు సూసైడ్ నోట్
- తన తండ్రిని మానసికంగా వేధించారంటూ కొడుకు ఆవేదన
- ఆలయం కట్టాకే ఆ ఏరియా డెవలప్ అయిందని వీడియో మెసేజ్
1972లో సంతోషినగర్ ఏరియా అభివృద్ధిలో అంతంతమాత్రంగానే ఉన్న సమయంలో మహేంద్ర మినేకర్ తండ్రి ఈ గుడిని కట్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఏరియా బాగా డెవలప్ అయింది. ప్రస్తుతం ఈ ఆలయ స్థలంపై కన్నేసిన కొంతమంది రియల్టర్లు దానిని కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మహేంద్ర మినేకర్ కుటుంబం ఆరోపిస్తోంది. కార్పొరేషన్ అధికారులు కూడా బిల్డర్లకే వత్తాసు పలుకుతూ గుడిని కూల్చేందుకు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తన తండ్రి మహేంద్ర మినేకర్ పై అధికారులు, బిల్డర్లు ఒత్తిడి తీసుకొచ్చారని, కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నారని బ్రిజేశ్ మినేకర్ చెప్పారు.
ఈ క్రమంలోనే ఆదివారం తన తండ్రి మహేంద్ర మినేకర్ గుడి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డాడని కంటతడి పెట్టారు. సూసైడ్ నోట్ లో గుడిని కాపాడాలని తనకు సూచించారంటూ బ్రిజేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. కాగా, మహేంద్ర మినేకర్ ఆత్మహత్యకు సంబంధించి బ్రిజేశ్ మినేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బ్రిజేశ్ ఆరోపణలపై సమగ్ర దర్యాఫ్తు జరిపిస్తామని వెల్లడించారు.