10 రోజులు బాత్ టబ్ లో పడుకుంటే చాలు... రూ. 4.72 లక్షలు చెల్లిస్తారు!
ఈ ప్రయోగంలో పాల్గొనేవారు పది రోజుల పాటు నీటితో నిండిన టబ్‌లో పడుకుని ఉండాలి. వారి శరీరం ఛాతీ పైభాగం వరకు నీటిలో మునిగి ఉంటుంది, చేతులు, తల మాత్రం నీటిపైకి ఉంటాయి. ఇలా చేయడం వల్ల వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు కలిగే అనుభూతికి దగ్గరగా ఉంటుందని ESA తెలిపింది. పడుకున్న స్థితిలో ఉండగానే ఆహారం తీసుకోవడానికి తేలియాడే బోర్డును, మెడకు దిండును ఏర్పాటు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తాత్కాలికంగా ఒక ట్రాలీపైకి మారుస్తారు. ఒంటరిగా ఉన్నట్టు అనిపించకుండా వాలంటీర్లు ఫోన్లు వాడుకోవడానికి అనుమతి ఉంది.
పది రోజుల తర్వాత వాలంటీర్లు ఒకసారి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా, అంతరిక్ష వాతావరణానికి శరీరం ఎలా అలవాటు పడుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, వ్యోమగాముల ఆరోగ్యం, పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన నివారణ చర్యలను కూడా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రయోగంలో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల, 1.65 మీటర్ల నుంచి 1.80 మీటర్ల ఎత్తు ఉన్న పురుషులు మాత్రమే అర్హులు. వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 20 నుంచి 26 మధ్య ఉండాలి. ఎలాంటి అలర్జీలు, ఆహార నియమాలు లేని వారు మాత్రమే ఈ ప్రయోగానికి ఎంపిక చేస్తారు.