రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు జగన్ ఆస్తులెంత? ఇప్పుడున్న ఆస్తులెంత?: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

  • తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని జగన్ భారీగా అక్రమాస్తులు సంపాదించారన్న బొలిశెట్టి
  • కోడికత్తి, బాబాయ్ హత్య డ్రామాలతో అధికారంలోకి వచ్చారని విమర్శ
  • అంబటి కూడా పవన్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పుట్టలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన పదవిని అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి సీఎం కావడానికి ముందు జగన్ ఆస్తులు ఎంత? ఆ తర్వాత ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. కోట్లాది రైతు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారని చెప్పారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల రైతులకు కూడా పవన్ అండగా నిలబడ్డారని అన్నారు. 

వైసీపీ మాదిరి ప్రతి ఎన్నికల ముందు ఒక స్టంటు చేసే అలవాటు కూటమి పార్టీలకు లేదని చెప్పారు. కోడికత్తి, బాబాయ్ హత్య డ్రామాలు ఆడి జగన్ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నారని... అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని అన్నారు. 

రుషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారని ప్రశ్నించారు. పేర్ని నాని, రంగనాథ్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి బియ్యం దొంగలు కాదా? అని అడిగారు. నాదెండ్ల మనోహర్ అక్రమ బియ్యం రవాణాను అరికట్టారని చెప్పారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటికి... డయాఫ్రం వాల్ అంటే ఏమిటో కూడా తెలియదని... ఆయన కూడా నిన్న పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాకిస్థాన్ లాంటిదని... కూటమి ఇండియా లాంటిదని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు చీకటిలో మగ్గిపోయిందని విమర్శించారు.


More Telugu News