ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 8 కీలక ప్రదేశాలను గుర్తించిన ఎన్జీఆర్ఐ

  • ఆచూకీని గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నల్స్ పంపించినట్లు వెల్లడి
  • రెండు చోట్ల తవ్వకాలు జరిపితే యంత్రపరికరాలు కనిపించాయన్న శాస్త్రవేత్త
  • మిగిలిన ఆరు చోట్ల తవ్వకాలు ప్రారంభించినట్లు వెల్లడి
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నల్స్ పంపించగా ఎనిమిది ప్రదేశాల నుండి బలమైన సిగ్నల్స్ అందాయని ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. సత్యనారాయణ తెలిపారు.

ఆయన ఈనాడు దినపత్రికతో మాట్లాడుతూ, సొరంగంలో ఆయా ప్రాంతాలను, లోతును లెక్కగట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అందించినట్లు తెలిపారు. సిగ్నల్స్ అందిన రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్రపరికరాలు కనిపించాయని అన్నారు.
మిగిలిన ఆరు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టినట్లు తెలిపారు. 

జీపీఆర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నళ్లను పంపి, భూమి లోపలి పొరల్లో ఏం ఉందో గుర్తించే ప్రయత్నం చేశామని తెలిపారు. సొరంగం లోపలి నుండి మాత్రమే కాకుండా, ఎక్కడ కూలిందనే విషయాన్ని తెలుసుకోవడానికి కొండ పైనుండి కూడా గుర్తించే ప్రయత్నం చేశామని తెలిపారు. 200 మీటర్ల లోతు వరకు చూడగలిగామని, కానీ కొండపై నుండి సొరంగం 500 మీటర్ల లోతులో ఉందని తెలిపారు. ప్రభుత్వం మరింత అధ్యయనం చేయాలని కోరితే సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.


More Telugu News