భ్రమల్లో నుంచి రేవంత్ బయటకు రావాలి... 2028లో బీసీ నేత సీఎం కావడం ఖాయం: తీన్మార్ మల్లన్న
- తనను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ భ్రమపడుతున్నారన్న మల్లన్న
- కులగణనపై రేవంత్ తో తాను చర్చకు సిద్ధమని వ్యాఖ్య
- కేసీఆర్ తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్న
90 ఏళ్ల తర్వాత కులగణన చేస్తే చప్పట్లు కొట్టేవాడు ఒకడు కూడా లేడని అన్నారు. కులగణనపై రేవంత్ తో చర్చకు తాను సిద్ధమని చెప్పారు. పక్కనున్న వాళ్లు బానిసలుగా బతకాలనేది రేవంత్ వ్యక్తిత్వమని విమర్శించారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని మల్లన్న అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఒక న్యాయం... తనకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలకు కాంగ్రెస్ లో స్వేచ్ఛ లేదని అన్నారు. పప్పు, బెల్లం మాదిరి రెడ్లు కార్పొరేషన్ పదవులను పంచుకున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని మల్లన్న ఆరోపించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి స్థానాల నుంచి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి... తనను గెలిపించారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బలమైన కేసీఆర్ తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీకి పునాది పడటానికి తానే కారణమని చెప్పారు.