తెలంగాణలో ఉండేవాళ్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా: సీఎం చంద్రబాబు

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు
  • టీడీపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ
  • గోదావరి నీళ్ల అంశం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు 
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు అనంతరం ఈ సాయంత్రం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. 

"నిన్నా మొన్నా ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నారు. తెలుగు జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా... తెలంగాణలో  వాళ్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకుపోవాలన్నది నా ఆలోచన. ఇవన్నీ సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లు. 

సముద్రంలోకి పోయే నీళ్లను నేను సద్వినియోగం చేస్తానంటే... ఒక పార్టీ దీన్ని రాజకీయం చేస్తోంది... వాళ్లు రాజకీయం చేస్తున్నారు కాబట్టి, తాము కూడా చేయకపోతే వెనుకబడిపోతామని మరో పార్టీ కూడా రాజకీయం చేస్తోంది. ఇది మంచిది కాదు. 

నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను... తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ. ఒక యుగపురుషుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. ఆరోజు, ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. విభజన రోజు కూడా ఇదే మాట చెప్పాను... రెండు ప్రాంతాలు రెండు కళ్లు అని చెప్పాను... ఇద్దరికీ సమన్యాయం చేయాలని చెప్పాను. 

సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటామంటే... మీకు ఆ హక్కు ఎక్కడుంది అంటున్నారు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది.... నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదే! ఆ ప్రాజెక్టును నేను స్వాగతించాను. గోదావరిపై మీరు ప్రాజెక్టులు కట్టుకోండి... నీళ్లు తీసుకోండి... గోదావరి ఒక్కటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. 

1000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతుంటే సద్వినియోగం చేసుకుంటే తప్పెలా అవుతుంది? నా కోరిక ఇదొక్కటే కాదు... గంగా-కావేరి నదులు అనుసంధానం చేయాలి. మోదీ కంటే ముందు అప్పటి ప్రధాని వాజ్ పేయి టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. రాజకీయ నాయకులకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి... ఇవాళ మోదీ ఉన్నారు... సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా వచ్చారు. ఆయన దేశాన్ని నడిపిస్తే, తెలుగు జాతిని అగ్రస్థానం దిశగా నేను నడిపిస్తా" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News