బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన

  • బతికున్నంత కాలం రాజకీయ వారసుడిని ప్రకటించనన్న మాయావతి
  • కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని వెల్లడి
  • పార్టీ విధానాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తే వెంటనే తొలగిస్తామని హెచ్చరికలు
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడు అకాశ్ ఆనంద్‌ను పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి తప్పిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న అకాశ్ తండ్రి ఆనంద్ కుమార్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు రామ్ జీ గౌతమ్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. 

లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ అఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి కీలక ప్రకటనలు చేశారు. తాను బతికున్నంత వరకూ పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండరని ఆమె స్పష్టం చేశారు. మార్చి 15న నిర్వహించనున్న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. కాన్షీరామ్ సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని చెప్పిన మాయావతి.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని పేర్కొన్నారు. 

పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి బలహీన పరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను గత నెల పార్టీ నుంచి బహిష్కరించామని, ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్‌ను సైతం పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు వివరించారు. 


More Telugu News