ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత ఎవ‌రో చెప్పిన‌ క్లార్క్‌... త‌ప్ప‌కుండా ఆ జ‌ట్టే గెలుస్తుంద‌ని జోస్యం!

  • పాక్‌, యూఏఈలో జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ
  • ఇప్ప‌టికే గ్రూప్‌-ఏ నుంచి భార‌త్‌, కివీస్ సెమీస్‌కు అర్హ‌త‌
  • గ్రూప్‌-బీ నుంచి సెమీ ఫైన‌ల్ చేరిన ఆస్ట్రేలియా
  • ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
పాకిస్థాన్‌, యూఏఈలో జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ లీగ్ ద‌శ ముగింపున‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే గ్రూప్‌-ఏ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ సెమీస్‌కు చేర‌గా... గ్రూప్‌-బీ నుంచి ఆస్ట్రేలియా సెమీ ఫైన‌ల్‌కి అర్హ‌త సాధించింది. ఈ రోజు ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌తో గ్రూప్-బీ నుంచి రెండో సెమీ ఫైన‌లిస్ట్ ఖ‌రారు కానుంది. ఈ మ్యాచ్‌లో ఒక‌వేళ‌ స‌ఫారీలు భారీ తేడాతో ఓడితే... ఆఫ్ఘ‌నిస్థాన్‌కు సెమీ ఫైన‌ల్ వెళ్లే అవ‌కాశం ద‌క్కుతుంది. 

అదే దక్షిణాఫ్రికా గెలిస్తే... ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌నిలేకుండా నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఇక సెమీస్ మ్యాచ్ లు ఈ నెల 4 నుంచి జరుగుతాయి. ఆ రోజు భార‌త్‌తో గ్రూప్‌-బీలోని సెమీ ఫైన‌ల్ చేరిన ఒక జ‌ట్టు త‌ల‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తాజాగా ఈసారి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత ఎవ‌రు అనే దానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌, ఆసీస్ జ‌ట్లు ఫైన‌ల్‌కు వెళ‌తాయ‌ని మాజీ క్రికెట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక తుది పోరులో ఆస్ట్రేలియాను టీమిండియా ఒక్క ప‌రుగు తేడాతో ఓడిస్తుంద‌ని జోస్యం చెప్పాడు. దుబాయ్‌లో పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుంద‌న్నాడు. భార‌త ఆట‌గాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నార‌ని తెలిపాడు. 

ఇక‌ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అటాకింగ్ గేమ్ టీమిండియాకు కీల‌కంగా మార‌నుంద‌న్నాడు. త‌న అంచనా ప్ర‌కారం ఈ టోర్న‌మెంట్‌లో త‌ప్ప‌కుండా హిట్‌మ్యాన్ టాప్ స్కోర‌ర్‌గా నిలుస్తాడ‌ని చెప్పుకొచ్చాడు. 


More Telugu News