Botsa Satyanarayana: సీఎంని, ఆయన కొడుకుని పొగుడుకోవడమే కనిపించింది: బడ్జెట్ పై బొత్స విమర్శలు

ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ లో ఏ రంగానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. బడ్జెట్ తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి, పరనిందలా కొనసాగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం... ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని పొగుడుకోవడమే కనిపించిందని అన్నారు. ఇలాంటి సంప్రదాయం దురదృష్టకరమని చెప్పారు. 

18 నుంచి 50 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పారని... బడ్జెట్ లో ఆ ఊసే లేదని బొత్స విమర్శించారు. 52 లక్షల మంది రైతులకు రైతు భరోసా రూ. 20 వేలు ఇచ్చేందుకు రూ. 12 వేల కోట్లు కావాల్సి ఉంటుందని... బడ్జెట్ లో అరకొరగా నిధులు కేటాయించారని దుయ్యబట్టారు. 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని చెప్పారు. వైసీపీ హయాంలో రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడితే... ఈ బడ్జెట్ లో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఇది ప్రజలకు న్యాయం చేసే బడ్జెట్ కాదని అన్నారు.
Botsa Satyanarayana
YSRCP
AP Budget

More Telugu News