స‌చిన్‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా!

  • ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ లో ఇండియా మాస్ట‌ర్స్ వ‌రుస‌గా రెండో విజ‌యం
  • ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించిన స‌చిన్ సార‌థ్యంలోని ఇండియా జ‌ట్టు
  • 21 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 34 ర‌న్స్ బాదిన స‌చిన్‌
ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ టోర్నీలో ఇండియా మాస్ట‌ర్స్ దూసుకెళ్తోంది. బుధ‌వారం వ‌రుస‌గా రెండో విజయాన్ని న‌మోదు చేసింది. స‌చిన్ టెండూల్క‌ర్ సార‌థ్యంలోని ఇండియా జ‌ట్టు ఇంగ్లండ్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇండియా మాస్ట‌ర్స్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 132 ప‌రుగులే చేసింది. 

ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో మ్యాడీ (25), టీమ్ ఆంబ్రోస్ (23) మాత్ర‌మే ప‌ర్వాలేద‌నిపించారు. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. ఇండియా బౌల‌ర్ల‌లో ధ‌వ‌ళ్ కుల‌క‌ర్ణి 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... ప‌వ‌న్ నేగి, అభిమ‌న్యు మిథున్ త‌లో రెండు వికెట్లు తీశారు. అనంత‌రం 133 ప‌రుగుల ల‌క్ష్యఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఇండియా మాస్ట‌ర్స్ 11.4 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్టే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. 

ఓపెన‌ర్‌గా బరిలోకి దిగిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ బ్యాట్ ఝళిపించాడు. శ్రీలంక మాస్ట‌ర్స్‌తో జ‌రిగిన‌ మొద‌టి మ్యాచ్‌లో కేవ‌లం 10 ప‌రుగులే చేసిన ఆయ‌న ఈ మ్యాచ్‌లో మాత్రం త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో అల‌రించాడు. 21 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 34 ర‌న్స్ బాదాడు. గురుకీర‌త్ (63 నాటౌట్‌), యువ‌రాజ్ సింగ్ (27 నాటౌట్‌) మ‌రో వికెట్ ప‌డ‌కుండా ల‌క్ష్యాన్ని ఛేదించారు.  



More Telugu News