అక్బర్, ఔరంగజేబుల గురించే తప్ప పాఠ్యపుస్తకాల్లో శంభాజీ చరిత్ర లేదేం?: ఆకాశ్ చోప్రా
- ఛావా సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మాజీ క్రికెటర్
- మరాఠా సామ్రాజ్య పాలకుడి గురించి పాఠశాలలో నేర్పించలేదని వ్యాఖ్య
- వివాదాస్పదం చేయొద్దంటూ నెటిజన్ల కామెంట్లు
ఛావా సినిమా చూశాక ఇంత గొప్ప చక్రవర్తి గురించి పిల్లలకు ఎందుకు నేర్పించడంలేదని అనిపించిందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. ‘అక్బర్ గొప్ప నాయకుడని, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని స్కూలులో నేర్పించారు, ఔరంగజేబు పేరును ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి పెట్టారు. కానీ శంభాజీ గురించి ఎక్కడా చెప్పలేదు. అలా ఎందుకు చేశారు?’ అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
‘మీరు చరిత్ర నేర్చుకోలేదా?’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తాను చరిత్రలో టాపర్ నని, చరిత్రలో 80 శాతం మార్కులు తెచ్చుకున్నానని చోప్రా జవాబిచ్చారు. కొంతమంది నెటిజన్లు ఆకాశ్ చోప్రాను సమర్థిస్తూ కామెంట్లు పెడుతుండగా.. మరికొంతమంది మాత్రం దీనిని వివాదాస్పదం చేయొద్దని అంటున్నారు. కాగా, ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఛావా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారని సినీ పండితులు మెచ్చుకుంటున్నారు.