ఇద్దరు సహచరులను కాల్చి చంపి.. తనను తాను కాల్చుకున్న సీఆర్‌పీఎఫ్ జవాను

  • మణిపూర్‌లోని లామ్‌సంగ్ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఘటన
  • వ్యక్తిగత వివాదమే కారణం అయి ఉంటుందని అనుమానం
  • ఘటనలో మరో 8 మందికి తీవ్ర గాయాలు
  • రాష్ట్రంలో నిన్నటి నుంచి రాష్ట్రపతి పాలన  
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాను ఒకరు సొంత క్యాంపుపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యక్తిగత వివాదమే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 ఇదొక దురదృష్టకర ఘటన అని, రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని మణిపూర్ పోలీసులు తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లామ్‌సంగ్ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఈ ఘటన జరిగిందన్నారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది గాయపడినట్టు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నట్టు వివరించారు. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

కాగా, ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో మణిపూర్‌లో నిన్న రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ఇంఫాల్‌లోని కంగల్ ఫోర్ట్ వెలుపల ఆర్మీని మోహరించారు. 


More Telugu News