రాణించిన రాణా, జడేజా... ఇంగ్లండ్ 248 ఆలౌట్

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • చెరో 3 వికెట్లు తీసిన రాణా, జడేజా
  • అర్ధసెంచరీలు నమోదు చేసిన బట్లర్, బెతెల్
టీమిండియా బౌలర్లు హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా రాణించడంతో తొలి వన్డేలో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. 

కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న యువ పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. మరో ఎండ్ లో లెఫ్టార్మ్ స్పిన్ తో జడేజా కూడా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనంలో పాలుపంచుకున్నాడు. మహ్మద్ షమీ 1, అక్షర్ పటేల్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చూస్తే... ఆ జట్టుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) తొలి వికెట్ కు 75 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే, ఈ దశలో టీమిండియా బౌలర్లు విజృంభించి వెంటవెంటనే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ జోరుకు కళ్లెం వేశారు. 

ఇంగ్లండ్ మిడిలార్డర్ లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెతెల్ (51) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ వేగంగా ఆడి 21 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (0) డకౌట్ అయ్యాడు. సీనియర్ ఆటగాడు జో రూట్ 19 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు.


More Telugu News