ఏపీలో పునరుత్పాదక పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఎన్విజన్ సంసిద్ధత
- దావోస్‌లో ఎన్విజన్ సీఈవో లీ జంగ్‌తో లోకేశ్ సమావేశం
- పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్న మంత్రి
- తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందుకోవాలని సూచన
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న లీ జంగ్
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతిశీల ఆలోచనలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్‌లకు ప్రతిభావంతులైన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహించాలని మంత్రి లోకేశ్ కోరారు.
స్పందించిన లీ జంగ్ మాట్లాడుతూ.. 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్‌లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్బైన్ సరఫరాదారుగా నిలచిందని తెలిపారు. భారతదేశంలో 3 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పూణేలోని నాసెల్లెలో, బ్లేడ్ల కోసం తిరుచ్చిలో రూ. 500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నామని, ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు