చికిత్స కోసం వెళితే నర్సులు తిట్టారని ఆసుపత్రిలోనే రోగి ఆత్మహత్య
- ప్రభుత్వ ఆసుపత్రి బాత్రూమ్ లో ఉరేసుకున్న మహిళ
- మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- నర్సులే కారణమని ఆరోపిస్తున్న మేనల్లుడు.. దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
బాధితుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందన్ పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడింది. సోమవారం సాయంత్రం నారమ్మ మేనల్లుడు నరేష్ ఆమెను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు నారమ్మను ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. రాత్రిపూట విధుల్లో ఉన్న నర్సులు వైద్య సేవలందించే క్రమంలో నారమ్మను దుర్బాషలాడారని, దీంతో నారమ్మ తీవ్ర మనస్తాపం చెందిందని నరేష్ తెలిపాడు.
మంగళవారం ఉదయం బాత్రూమ్ కు వెళ్లిన నారమ్మ ఎంతకీ తిరిగిరాలేదని, దీంతో లోపలికి వెళ్లి చూడగా చున్నీతో మెడకు ఉరి బిగించుకుని వేళాడుతోందని అన్నాడు. వెంటనే కిందకు దించి ఎమర్జెన్సీ వార్డుకు తరలించామని, వైద్యులు పరీక్షించి నారమ్మ అప్పటికే చనిపోయిందని చెప్పారన్నాడు. నారమ్మ మరణానికి నర్సులే కారణమని నరేష్ ఆరోపించాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాఫ్తు చేస్తున్నారు.