వేళకాని వేళలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతా?.. ‘గేమ్ చేంజర్’పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

High Court Questions About Game Changer Movie Timings
  • ‘గేమ్ చేంజర్’పై లంచ్ మోషన్ పిటిషన్లు
  • నాలుగు గంటల షోకు అనుమతినివ్వడం, టికెట్ల రేట్ల పెంపు సరికాదన్న పిటిషనర్లు
  • షోకు, షోకు మధ్య తగినంత వ్యవధి ఉండటం లేదని ఆవేదన
  • తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు
  • 16 ఏళ్లలోపు పిల్లలు రాత్రివేళ సినిమాకు వెళ్తే పరిస్థితి ఏమిటని ప్రశ్న
  • పిటిషన్లకు ప్రజాప్రయోజన వ్యాజ్య స్వభావం ఉందని వ్యాఖ్య
అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాలకు వేళకాని వేళలో ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూనే రాంచరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినివ్వడంపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌లు దాఖలయ్యాయి.

తెల్లవారుజామున నాలుగు గంటల షోకు అనుమతినివ్వడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని ఈ సందర్భంగా పిటిషనర్లు వాదించారు. పుష్ప-2 సినిమా ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. షోల మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో సినిమాకు వచ్చే జనాలను అదుపు చేయడం కష్టంగా మారుతుందన్నారు. వాదనలు విన్న జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రదర్శించే సినిమాకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్తే వారి పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని పేర్కొంది. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని తెలిపింది. అంతేకాదు, రాత్రివేళ భారీగా వచ్చే జనాన్ని అదుపు చేసే విషయంలో పోలీసులపై అదనపు భారం పడుతుందని పేర్కొంది.

ప్రదర్శనకు, ప్రదర్శనకు మధ్య 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సమయంలో వందలమంది వాహనాలను తీసుకెళ్లడం, వచ్చేవారు పార్క్ చేయడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. ప్రస్తుతం దాఖలైన పిటిషన్లకు ప్రజాప్రయోజన వ్యాజ్య స్వభావం ఉందని, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, రేట్ల పెంపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను నేటికి (శుక్రవారం) వాయిదా వేసింది. 
Go Back to Shorts
Game Changer
Tollywood
TS High Court

More Telugu News