Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లికి పెద్దలు అంగీకరించరని.. కారులో పెట్రోలు పోసుకుని ప్రేమజంట ఆత్మాహుతి

Lovers Committed Suicide In Car On Hyderabad ORR
Advertisement
  • ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • వీరి ప్రేమ విషయం తెలిసి పోకిరీ బ్లాక్‌మెయిలింగ్, డబ్బు వసూలు
  • మరోవైపు, బాలిక ఇంట్లో గొడవలు
  • కారు అద్దెకు తీసుకుని ఓఆర్ఆర్ పైకి చేరుకుని పెట్రోలు పోసుకున్న జంట
  • కారులోనే కాలి బూడిదైన బాలిక.. కేకలు వేస్తూ బయటకు వచ్చి కిందపడి మృతి చెందిన యువకుడు
Advertisement
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నారు. కానీ, కులం వారి మధ్య అడ్డుగోడగా నిలిచింది. కులం పేరు చెప్పి పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరేమోనని భయపడ్డారు. దీనికితోడు అమ్మాయి ఇంకా మేజర్ కాకపోవడం, వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని ఓ పోకిరీ బెదిరించడం.. ఇలా అన్ని వైపుల నుంచి వారిపై ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయారు. కలిసి జీవించలేమని భావించారు. కారులో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ విషాద ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. బీబీనగర్ మండలంలోని జమిలాపేటకు చెందిన శ్రీరాములు (25), ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చెందిన బాలిక (17) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం బాలిక ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. బాలికను మందలించడంతోపాటు పలుమార్లు చేయి కూడా చేసుకున్నారు. అయినప్పటికీ వారు తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బాలిక బంధువు చింటూకి వీరి ప్రేమ గురించి తెలియడంతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా శ్రీరాములు నుంచి రూ. 1.35 లక్షలు వసూలు చేశాడు. అయినప్పటికీ మరింత కావాలని పట్టుబట్టడం, పెళ్లికి పెద్దలు అంగీకరించే ప్రసక్తే లేదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

శ్రీరాములు నిన్న సాయంత్రం ఓ సెల్ఫ్‌డ్రైవ్ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు.  బాలికతో కలిసి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వద్దకు చేరుకున్నాడు. రోడ్డు పక్కన కారు ఆపి వెంట తెచ్చుకున్న పెట్రోలును మీద పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు భరించలేని శ్రీరాములు బయటకు వచ్చి కేకలు వేస్తూ కిందపడి మృతి చెందాడు. బాలిక శరీరం గుర్తించలేనంతగా కారులోనే కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే కారు పూర్తిగా బుగ్గి అయింది. కాగా, ప్రేమ విషయాన్ని కుమారుడు కొన్ని రోజుల క్రితమే తమకు చెప్పాడని శ్రీరాములు తల్లిదండ్రులు తెలిపారు. ఘటనకు కొన్ని నిమిషాల ముందు సూసైడ్ లేఖ పంపాడని చూపిస్తూ బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement
Tragedy
Lovers
Crime News
Hyderabad

More Telugu News