Bihar: రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ.. ముగ్గురు టీనేజ‌ర్ల మృతి!

Bihar Teens Playing PUBG On Railway Track Killed After Train Runs Over Them
షార్ట్స్‌లో చూడండి
బిహార్‌లో ప‌బ్‌జీ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుప‌ట్టాల‌పై ప‌బ్‌జీ ఆడుతున్నారు. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని ఉండ‌టంలో రైలు వ‌స్తున్న సంగ‌తిని వారు గుర్తించ‌లేదు. దాంతో వేగంగా వ‌చ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురూ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ రైలు సెక్షన్‌లోని మాన్సా తోలాలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది.

మృతులను గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన‌ సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు వారి పిల్లల మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామాలకు తరలించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా విషాదాన్ని నింపింది. 

సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీఓ) వివేక్ దీప్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్ర‌మాదం జ‌రిగిన తీరును పరిశీలించారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై మొబైల్ గేమ్‌లు ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల గేమింగ్ అలవాట్లను పేరెంట్స్‌ పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను జ‌ర‌గ‌కుండా బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాల‌ని అధికారులు తల్లిదండ్రులను కోరారు.
Go Back to Shorts
Bihar
PUBG
Railway Track

More Telugu News