దక్షిణ కొరియా అధ్యక్షుడికి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్
- దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
- మూడు సార్లు విచారణకు గైర్హాజరు కావడంతో అధ్యక్షుడిపై కోర్టును ఆశ్రయించిన దర్యాప్తు అధికారులు
- విపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204, వ్యతిరేకంగా 85 ఓట్లు
యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీస్, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. ఈ క్రమంలో మూడు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు వారెంట్ కోరుతూ దర్యాప్తు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, అనుకూలంగా 204 మంది ఓటు వేయగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష బాధ్యతలను, విధులను ప్రధాన మంత్రి హన్ డక్ సూకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానాన్ని పార్లమెంట్ రాజ్యాంగ న్యాయస్థానానికి పంపుతుంది. అయితే యూన్‌ను తప్పించాలా ? కొనసాగించాలా ? అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లో తేల్చనుంది. కాగా, యూన్ సైతం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు పేర్కొంటున్నారు.