రవిచంద్రన్ అశ్విన్ బాటలో మరికొందరు సీనియర్ క్రికెటర్లు?

  • డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరితే వీడ్కోలు ప్రకటనలకు ఛాన్స్
  • జట్టు పరివర్తన దశలో అడుగుపెట్టే సూచనలు
  • ఆసక్తికర కథనాన్ని ప్రచురించిన ‘క్రిక్‌బజ్’ కథనం
  • 2008 తరహాలోనే జట్టు పరివర్తనకు గురికావొచ్చని విశ్లేషణ
దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్‌మెంట్ నిర్ణయం భారతీయ క్రికెట్ అభిమానులనే కాకుండా తోటి క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు ప్లేయర్లు ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే, అశ్విన్ ఆకస్మిక వీడ్కోలు మాదిరిగానే సమీప భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలు ఉండవచ్చనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

భారత జట్టు ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు చేరుకుంటే... వచ్చే ఏడాది జూన్‌ నెలలో లార్డ్స్ వేదికగా జరిగే టైటిల్ పోరు తర్వాత టీమిండియా పరివర్తన దశలోకి ప్రవేశించవచ్చని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రణాళిక ప్రకారమా? లేక స్వచ్ఛందంగా జరుగుతుందా? అనేది చెప్పలేం, కానీ భారత జట్టు పరివర్తన చెందుతుందని ‘క్రిక్‌బజ్’ పేర్కొంది. వచ్చే ఏడాది వేసవిలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో తన తదుపరి టెస్ట్ సిరీస్ ఆడనుందని, ఈ సిరీస్ ప్రారంభం నాటికి మార్పులు ఉండవచ్చని విశ్లేషించింది. 

గతాన్ని పరిశీలిస్తే ఆస్ట్రేలియా పర్యటనలు ఆటగాళ్లకు ప్రశంసలు తెచ్చిపెట్టడం లేక అపఖ్యాతి పాలుచేయడం జరుగుతోందని, ఆటగాళ్లు బాధాకరమైన రీతిలో ముగింపు పలికారని ‘క్రిక్‌బజ్’ పేర్కొంది. 2008లో సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే ఒకే సిరీస్ తర్వాత రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారని, 2025 కూడా భారత క్రికెట్‌లో రిటైర్‌మెంట్ ఏడాది కావచ్చని విశ్లేషించింది.

రిటైర్‌మెంట్‌లు ఉంటాయని ఎవరూ బహిరంగంగా అంగీకరించే అవకాశం లేదు. అయితే, ఈ తరహా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్న సిరీస్‌లలో ఆసీస్ పర్యటన మొదటిది. 2008లో కూడా ఇదేవిధంగా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు వెంటవెంటనే వీడ్కోలు పలకడంతో జట్టు పరివర్తనకు గురైందని పేర్కొంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత్ జట్టు విఫలమైతే ఆస్ట్రేలియా తర్వాత జరగబోయే సిరీస్‌లలో ప్రకటనలు ఉండవచ్చని క్రిక్‌బజ్ విశ్లేషించింది. కాగా, ఈ ఏడాది జూన్‌ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 కెరీర్‌లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్‌, విరాట్ కోహ్లీలు కొన్నాళ్లుగా బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో మినహా రోహిత్ శర్మ ఈ ఏడాది అస్సలు రాణించలేదు. విరాట్ కోహ్లీ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా కనిపించడం లేదు.


More Telugu News