ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులకు ఏబీసీడీ అవార్డుల అందజేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులకు ఏబీసీడీ అవార్డుల అందజేత

abcd awards AP DGP Dwaraka Tirumala Rao
  • ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ టీమ్
  • నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
  • జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేసిన ఎస్పీలకు ప్రశంసా పత్రాల అందజేత  
నేర పరిశోధనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పోలీస్ శాఖ ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులను ఏపీ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రదానం చేశారు. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా జులై నుంచి సెప్టెంబర్ 2024 మూడవ త్రైమాసానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేసుల పూర్వాపరాలను, కేసుల పరిష్కారంలో వినియోగించిన సాంకేతిక పద్ధతులను, వినూత్న విధానాలను పూర్తిగా పరిశీలించిన సీఐడీ అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ నాలుగు ఉత్తమ కేసులను ఎంపిక చేశారు. 

అవార్డుకు ఎంపికయిన కేసుల వివరాలు

చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి. ఎన్ మణికంఠ చందోలు నేతృత్వంలోని టీమ్ జిల్లా పరిధిలోని గుడిపాల ఏటీఎం నుంచి సుమారు 26 లక్షల దొంగతనం చేసిన కేసును సాంకేతికత సహాయంతో త్వరితగతిన ఛేదించినందుకు గాను ఉత్తమ బహుమతి అందజేయడం జరిగింది.

గుంతకల్లు రైల్వే పోలీస్ ఎస్పీ శ్రీ రాహుల్ మీనా నేతృత్వంలోని టీమ్ హిందూపూర్ రైల్వే పోలీస్ పరిధిలో మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి బంగారం, నగదు, లాప్ ట్యాబులు, మొబైల్ ఫోన్‌లను దొంగతనం చేసిన కేసును సమర్ధవంతమయిన రీతిలో ఛేదించినందుకు ద్వితీయ బహుమతిని అందజేశారు.
 
కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ నేతృత్వంలోని టీమ్ జిల్లా పరిధిలోని ఆస్పరి మండల పరిధిలో జరిగిన హత్య కేసును చాకచక్యంగా ఛేదించినందుకు గాను తృతీయ బహుమతిని అందించారు. 
 
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణా రావు నేతృత్వంలోని టీమ్ అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోని గుడిలో జరిగిన దొంగతనం కేసులో 11 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని పెండింగ్‌లో ఉన్న 40 పాత దొంగతనం కేసులను ఛేదించినందుకు గాను కన్సోలేషన్ బహుమతిని అందజేశారు.
 
ఏబీసీడీ అవార్డుల ప్రదానంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరచి మొదటి స్థానం పొందిన కేసుకు లక్ష రూపాయల ప్రైజ్ మని, రెండవ స్థానం పొందిన కేసుకు రూ.60 వేలు, మూడవ బహుమతి పొందిన కేసుకు 40 వేల రూపాయలు, కన్సోలేషన్ బహుమతి పొందిన కేసుకు రూ.20 వేలు ప్రైజ్ మనీ, ప్రశంస పత్రాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు అందజేశారు. 

అలాగే, ఈ నెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో విశేషంగా కృషి చేసి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా శ్రమపడిన కర్నూల్, విజయనగరం, కృష్ణాజిల్లాల ఎస్పీలు, వారి టీమ్‌లకు డీజీపీ ప్రశంస పత్రాలు అందించారు. 
Advertisement
abcd awards
DGP Dwaraka Tirumala Rao
AP Police

More Telugu News