Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish Rao responds on Allu Arjun arrest
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. జాతీయ ఉత్తమ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని నిలదీశారు.

సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, కానీ దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని ఆరోపించారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు? అని ప్రశ్నించారు.

రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు.

ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు  చనిపోయారు... దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు... దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి... చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని హరీశ్ రావు రాసుకొచ్చారు.
Go Back to Shorts
Allu Arjun
Harish Rao
BRS
Congress
Revanth Reddy

More Telugu News