ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు, ఎకడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదు: నారా లోకేశ్

Nara Lokesh attends district collectors meeting
  • అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సమావేశం
  • హాజరైన మంత్రి నారా లోకేశ్
  • జీరో డ్రాపవుట్స్, ఎన్ రోల్ మెంట్ పై దృష్టి సారించాలని వెల్లడి
  • మధ్యాహ్న భోజనం, హాస్టల్ మెస్ నాణ్యతకు చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
గత ఐదేళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదని, రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టిసారించి ఏపీ మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో మానవవనరుల శాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ పెరగాలని, జీరో డ్రాపవుట్స్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

"ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు, ఎకడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదు. పారదర్శకమైన విధానాలతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు, ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ ను పొందుపరుస్తూ జిల్లాలవారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులను అందజేస్తున్నాం. రాబోయే వంద రోజుల యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. 

ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించాలి. పోషకవిలువలు కలిగిన పౌష్టికాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం లోకల్ మెనూతో మధ్యాహ్న భోజనం అందించే వెసులుబాటును కలెక్టర్లకు కల్పించాం. ఉన్నత విద్యలో కూడా హాస్టల్, భోజన సౌకర్యాలపై దృష్టిపెట్టాలి. 

ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ, కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రతివారం విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాన్ని చేపట్టాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మెస్, సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. 

పాఠశాలలు, కళాశాలల్లో మత్తుపదార్ధాల నివారణకు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. అన్ని స్కూళ్లు, కాలేజీల్లో ఈగల్ టీమ్స్, క్లబ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనను చర్యలు చేపడుతున్నాం. 

అపార్ ఐడీ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులంతా కృషిచేయాలి" అని మంత్రి లోకేశ్ కోరారు.
Go Back to Shorts
Nara Lokesh
Education
District Collector
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News