అమెరికాలో ట్రంప్ గెలుపు... జనగామలో ఆరడుగుల ట్రంప్ విగ్రహం వద్ద సెలబ్రేషన్స్
- తెలంగాణలోని జనగామ జిల్లా కొన్నె గ్రామంలో సంబరాలు
- 2019లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బుస్సా కృష్ణ
- ట్రంప్ గెలుపుతో విగ్రహానికి పూలదండ వేసి సంబరాలు చేసిన యువత
కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ 6 అడుగుల విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. నుదుట విజయ తిలకం దిద్ది... పూలదండ వేసి వేడుకలు చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని 2019లో జనగామకు చెందిన బుస్సా కృష్ణ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బుస్సా కృష్ణ మృతి చెందాడు. 2020లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటు వచ్చి కృష్ణ చనిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.
తాజాగా, ఆ విగ్రహం వద్ద కొంతమంది యువత ట్రంప్ గెలుపు సంబరాలు జరుపుకుంది. ట్రంప్ అభిమాని బుస్సా కృష్ణ తన ఇంటి ఆవరణలో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ట్రంప్ ఆరోగ్యం బాగుండాలని... మంచి పరిపాలన చేయాలని గతంలో బుస్సా కృష్ణ రక్తాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం చేశాడు.