వికెట్ కీపింగ్ చేయకపోయినా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయవచ్చా?
- గాయం కారణంగా ఆట రెండో రోజు మైదానాన్ని వీడిన రిషబ్ పంత్
- గాయం కారణంగా మైదానాన్ని వీడితే బ్యాటింగ్ చేయవచ్చని చెబుతున్న ఎంసీసీ రూల్స్
- ఆట నాలుగవ రోజు పంత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం
ఎంసీసీ (మెల్బోర్న్ క్రికెట్ క్లబ్) నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటికీ తిరిగి అతడి పాత్రలో ఆడగలిగితే ఎలాంటి జరిమానా ఉండదు. ఎంసీసీలోని 24.3.1 రూల్ ప్రకారం.. మ్యాచ్‌లో బాహ్య గాయానికి గురై మైదానం నుంచి నిష్క్రమించినా లేదా మైదానంలోకి రాలేకపోయినా దానిని ‘పెనాల్టీ టైమ్’గా పరిగణించరు. కాబట్టి రిషబ్ పంత్ ఫీల్డింగ్ చేయకపోయినప్పటికీ బ్యాటింగ్ చేయచ్చు.
కాగా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఒక బంతి రిషబ్ మోకాలికి తగిలింది. పంత్కి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర గాయమై శస్త్రచికిత్స జరిగిన భాగంలోనే ఈ బంతి తాకింది. వెంటనే కొంత వాపు వచ్చింది. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో పంత్ మైదానాన్ని వీడాడు.
కాగా బెంగళూరు టెస్టులో ఆతిథ్య జట్టు భారత్‌పై చారిత్రాత్మక విజయం సాధించాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది. భారత్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కాస్త పుంజుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 231/3గా ఉంది. న్యూజిలాండ్‌కు మరో 125 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ ఇవాళ మరో 125 పరుగులు సాధిస్తే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.