Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారిశ్రామిక దిగ్గజం ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌

Ratan Tata Passed Away at the age of 86
Advertisement
  • ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచిన ర‌త‌న్ టాటా
  • ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ధ్రువీక‌రించిన‌ టాటా స‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్ ఎస్ చంద్ర‌శేఖ‌ర‌న్
  • 1991లో 'టాటా సన్స్' ఛైర్మన్‌గా బాధ్యతలు
  • 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా కొన‌సాగిన‌ రతన్ టాటా
  • రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని మోదీ స‌హా పలువురు ప్ర‌ముఖుల‌ సంతాపం
Advertisement
దిగ్గజ పారిశ్రామికవేత్త, పలు టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా (86) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంట‌ల‌కు ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను టాటా స‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్ ఎస్ చంద్ర‌శేఖ‌ర‌న్ ధ్రువీక‌రించారు. 

సోమవారం నాడు వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చేరిన రతన్ టాటాను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్య‌ పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే క‌న్నుమూశారు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న నావ‌ల్ టాటా-సోనీ టాటా దంప‌తుల‌కు జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.

రతన్ టాటా 1991లో 'టాటా సన్స్' ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1991 మార్చి నుంచి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. 

టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటాది కీలక పాత్ర. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగింది.

దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా రతన్ టాటా అంతకుమించి గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60 నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అంద‌జేశారు.

2008లో రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోదీ స‌హా పలువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు.
Advertisement
Advertisement
Ratan Tata
Tata Groups
Mumbai

More Telugu News