Viral Video: ఆత్మహత్య కోసం రైలు పట్టాలపైకి.. ఆపై అలాగే నిద్రలోకి జారుకున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో ఇదిగో!

 Girl Lies Down on Track for Suicide Falls Asleep what happened next
  • బీహార్‌లోని చకియా రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైలు ఎంతకీ రాకపోవడంతో అలాగే నిద్రపోయిన బాలిక
  • రైలు పట్టాల మధ్య అనుమానాస్పద వస్తువేదే కనిపించడంతో లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్
  • సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగిన రైలు
రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న బాలిక ట్రాక్‌ మధ్యలో కూర్చుంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో అలాగే నిద్రపోయింది. చివరికి ఓ రైలు వచ్చినా లోకోపైలట్ గమనించడంతో ఆమె ఆత్మహత్య యత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీహార్‌లోని చకియా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. 

పట్టాల మధ్య అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందికి దిగిన పైలట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను తట్టిలేపాడు. ఏం జరుగుతోందో అర్థం కాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది. ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. తాను రానని ఆమె మొండికేసింది. దీంతో వారు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ నీకేమొచ్చిందని అడగడం వినిపించింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పిల్లలతో నిత్యం మాట్లాడుతుండాలని ఒకరంటే.. ఏ విషయంలోనైనా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదని ఇంకొకరు కామెంట్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ ఉండాలని, వారిని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయవద్దని చెప్పేది అందుకేనని మరొకరు కామెంట్ చేశారు.
Viral Video
Railway Track
Suicide
Bihar
Chakia Railway Station

More Telugu News