యూపీలో తోడేళ్ల అసాధారణ దాడులు... కారణం ఇదేనా...?
- ఉత్తరప్రదేశ్ బహరయిచ్ జిల్లాలో కలకలాన్ని రేపుతున్న తోడేళ్ల దాడులు
- 50 గ్రామాలకు చెందిన ప్రజల్లో భయాందోళనలు
- 'ఆపరేషన్ భేటీయా' కార్యక్రమంలో గుంపులోని ఐదు తోడేళ్లను బంధించిన అటవీ శాఖ అధికారులు
అయితే, తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటంపై ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ తన అభిప్రాయాలను పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బహుశా రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడం కారణం అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణమైన విషయమని అన్నారు. గత పదేళ్లలో ఈ తరహా ఘటన ఇదే మొదటిది కావచ్చని పేర్కొన్నారు. ఆ జంతువుల్లో దేనికయినా రేబిస్ సోకి ఉండవచ్చన్న అభిప్రాయంతో దాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. అయితే.. జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని అన్నారు. రేబిస్, కెనైట్ డిస్టెంపర్ వైరస్లు కొన్ని సార్లు పులుల వంటి వాటి ప్రవర్తనను మార్చగలవని, తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయని, తోడేళ్ల దాడులకు ఇది కారణమై ఉండవచ్చని ఎస్పీ యాదవ్ చెప్పుకొచ్చారు.