Weather Update: తెలంగాణలో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాల్లో నేడు రెడ్ అలర్ట్: హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రానున్న ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

ఈ ప్రాంతాల్లో ఇవాళ అతి తీవ్ర వర్షాలు..
ఈ రోజు (ఆదివారం) రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. 

ఈ ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జాబితాలో ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఉన్నాయి.

ఇక భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయని హెచ్చరించింది.

శనివారం దాకా వర్షాలు..
రాష్ట్రంలో శనివారం దాకా ఆరు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని అత్యధిక భాగంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం నుంచి శనివారం వరకు తేలిక పాటి నుంచి మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
Weather Update
Rain Alerts
Rain News
IMD
Telangana

More Telugu News