ఓలా క్యాబ్ డ్రైవర్ ను పైకెత్తి నేలకేసి బలంగా కొట్టిన ఆడీ కార్ ఓనర్.. వీడియో ఇదిగో
- ముంబైలో చోటు చేసుకున్న దారుణ ఘటన
- ఆడీ కారు బ్రేక్ వేయడంతో.. వెనుక నుంచి స్వల్పంగా ఢీకొన్న క్యాబ్
- క్యాబ్ డ్రైవర్ పై తీవ్రంగా దాడి చేసిన ఆడీ ఓనర్
ముందు ఆడీ కారు వస్తుండగా దాని వెనుక ఓలా క్యాబ్ వస్తున్నట్టు వీడియోలో ఉంది. ఆడీ యజమాని తన కారుకు బ్రేక్ వేసినప్పుడు... వెనుక నుంచి ఓలా క్యాబ్ బంపర్ ఆడీని ఢీకొట్టింది. వెంటనే ఆడీ ఓనర్ రిషబ్ చక్రవర్తి, ఆయన భార్య అంతారా ఘోష్, మరో మహిళ కారు నుంచి కిందకు దిగారు. తమ కారుకు డ్యామేజ్ జరిగిందా అని ఒక్క క్షణం చెక్ చేశారు. ఆ తర్వాత ఓలా డ్రైవర్ ఖయాముద్దీన్ ను బండ బూతులు తిడుతూ దాడి చేశాడు. ఖయాముద్దీన్ ను నేలకేసి బలంగా కొట్టడంతో... అతని తల నేలను బలంగా ఢీకొంది. దీంతో నేలపై అతను చలనం లేకుండా పడిపోయాడు. ఈ నెల 18న అర్ధరాత్రి సమయంలో ముంబైలో ఈ ఘటన జరిగింది. ఒక మాల్ కు ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.