KTR: మీ నిర్ణయం ప్రకారం ఇతర రాష్ట్రాలవారు లోకల్ అవుతారు... మన విద్యార్థులకు అన్యాయం చేస్తారా?: కేటీఆర్

KTR questions about GO 33
షార్ట్స్‌లో చూడండి
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. 

జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు, ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు. 9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోందని, ఈ నిర్ణయం ప్రకారం చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారన్నారు.

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలామంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని గుర్తు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్ఠంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా తాము గుర్తించామన్నారు.

దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్‌గానే పరిగణించబడే వారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాదిమంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని, మన విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా... గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KTR
BRS
Telangana
Congress

More Telugu News