బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

  • మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు
  • బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ సమావేశాలను హుందాగా నిర్వహించామని వ్యాఖ్య
  • కాంగ్రెస్ దురహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న మాజీ మంత్రి
అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమన్నారు.

'నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి గారు వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం.' అని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా? రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే మేము చేసిన తప్పా? విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా? అని ఆయన ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని... కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నారని హరీశ్ రావు అన్నారు.


More Telugu News

Harish Rao Revanth Reddy Congress BRS